వెయ్యి బడులకు కాంపౌండ్ వాల్స్..‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ కింద నిర్మించేలా ప్లాన్ 

వెయ్యి బడులకు కాంపౌండ్ వాల్స్..‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ కింద నిర్మించేలా ప్లాన్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడులకు రక్షణ కల్పించేందుకు విద్యాశాఖ కీలక అడుగు వేసింది. ప్రహరీలు లేక ఇబ్బందులు పడుతున్న వెయ్యి బడులకు కొత్తగా కాంపౌండ్ వాల్స్ నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్మాణాలను చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వీటిని ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ కింద నిర్మించేలా ప్లాన్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్.. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్‌‌మెంట్‌‌కు తాజాగా ప్రపోజల్ పంపింది.

దీనికి గానూ తగిన నిధులు, అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ స్కూల్ ఎడ్యకేషన్ డైరెక్టర్ ఇ.నవీన్ నికోలస్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌‌కు లేఖ రాశారు. కాంపౌండ్ వాల్స్ లేకపోవడంతో ఆవరణల్లోకి గుర్తు తెలియని వ్యక్తులు రావడం, స్కూల్ ఆస్తులకు నష్టం వాటిల్లడం వంటి సమస్యలను గుర్తించిన ఆఫీసర్లు.. వాటికి ఫుల్‌‌స్టాప్ పెట్టాలని నిర్ణయించారు.  జిల్లాల వారీగా కాంపౌండ్ వాల్స్ అవసరమున్న స్కూళ్ల జాబితాను అధికారుల నుంచి తెప్పించింది.

క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 31 జిల్లాల పరిధిలోని వెయ్యి గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లలో తక్షణమే రక్షణ గోడలు నిర్మించాల్సి ఉందని గుర్తించారు. ప్రహరీలు అవసరమైన స్కూళ్ల పేర్లు, జిల్లాల వారీగా సమగ్ర వివరాలను కూడా లేఖతో పాటు పంచాయతీరాజ్ శాఖకు అందజేసింది. ఈ వెయ్యి బడుల పరిధిలో మొత్తం కలిపి 2,85,982 మీటర్ల మేర కాంపౌండ్ వాల్స్ నిర్మించాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు లెక్క తేల్చారు. త్వరితగతిన నిధులు మంజూరు చేసి, నిర్మాణ పనులు మొదలయ్యేలా చూడాలని పీఆర్ శాఖ కమిషనర్‌‌ను కోరారు.